Abhishek Sharma: వరుసగా 0,0,0.. కట్ చేస్తే ఐసీసీ నెంబర్ వన్ బ్యాటర్గా అభిషేక్ శర్మ

Abhishek Sharma: వరుసగా 0,0,0.. కట్ చేస్తే ఐసీసీ నెంబర్ వన్ బ్యాటర్గా అభిషేక్ శర్మ

Abhishek Sharma: టీ20 వరల్డ్ కప్ 2026ని భారత జట్టు ఘనంగా ముగించేసింది. వరుసగా రెండోసారి ట్రోఫీని అందుకున్న  జట్టుగా చరిత్రలో నిలిచిపోయింది. దీంతో ఇవాళ (మార్చి 11న) ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ జాబితాను రిలీజ్ చేసింది. ఇందులో టీమిండియా యంగ్ బ్యాటర్లు అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ సత్తా చాటారు. మెగా టోర్నీలో వరుస 0, 0, 0 తర్వాత ఫైనల్ లో 52 పరుగులతో రాణించిన అభిషేక్ తన నెంబర్ –1 స్థానాన్ని పదిలపర్చుకున్నాడు. కాగా ఈవెంట్ మొత్తం అద్భుతమైన ప్రదర్శన చేసిన ఇషాన్ కిషన్ సెకండ్ ప్లేస్ లోకి దూసుకొచ్చాడు.

కాగా టీ20 ప్రపంచ కప్‌ ప్రారంభమైన తర్వాత అభిషేక్ శర్మ వరుసగా విఫలమయ్యాడు. అతడి ప్రదర్శనతో టీ20 ర్యాంకింగ్స్‌లో తన స్థానాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. కానీ ఎట్టకేలకు ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై జస్ట్18 బంతుల్లోనే 52 పరుగులు చేసి  అదరగొట్టాడు. దీంతో అతడి స్థానం పదిలమైంది. 875 పాయింట్లతో అభిషేక్ శర్మ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. గత రెండేళ్లు జట్టులోనే లేని ఇషాన్ కిషన్.. దేశవాళీలో సత్తా చాటి జాతీయ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత చేసిన అద్భుత ప్రదర్శనతో ఐసీసీ ర్యాంకింగ్స్‌లో 871 పాయింట్లతో రెండోస్థానంలోకి బుల్లెట్ లాగా దూసుకొచ్చాడు. అలాగే 742 పాయింట్లతో తిలక్ వర్మ 7వ స్థానంలో నిలవగా.. టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(722) 9వ ప్లేస్ లో, సంజు శాంసన్ 22 వ స్థానంలో కొనసాగుతున్నాడు.

అయితే నిన్నటి ( మార్చి 10న) వరకు అగ్రస్థానంలో నిలిచిన భారత మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తన స్థానాన్ని మాత్రం కోల్పోయాడు. ప్రపంచ కప్ టోర్నీలో వికెట్లు తీసినప్పటికీ భారీగా రన్స్ ఇవ్వడమే దీనికి ప్రధాన కారణం. దీంతో ఆఫ్ఘానిస్తాన్ బౌలర్ రషీద్ ఖాన్ 753 పాయింట్లతో నెంబర్ వన్ స్థానంలోకి వచ్చేశాడు. కాగా వరుణ్ చక్రవర్తి 740 పాయింట్లతో సెకండ్ ప్లేస్ కి పడిపోయాడు. స్టార్ పేసర్ బుమ్రా 702 పాయింట్లతో ఆరో స్థానానికి వచ్చాడు. అలాగే ఐసీసీ ఆల్‌రౌండర్ ర్యాంకింగ్స్ జాబితాలో తొలి స్థానంలో సికందర్ రజా(328),  రెండో ప్లేస్ లో హార్దిక్ పాండ్య(299), మూడో స్థానంలో సయామ్ ఆయూబ్(275) కొనసాగుతున్నారు. న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్(201) తొమ్మిదో స్థానంలో నిలిచాడు.